Report On Ramesh Hospital: నిర్లక్ష్యంగా వ్యవహరించింది.. రమేష్ హాస్పటల్ పై నివేదిక

Report On Ramesh Hospital: నిర్లక్ష్యంగా వ్యవహరించింది.. రమేష్ హాస్పటల్ పై నివేదిక
x
Ramesh Hospital
Highlights

Report On Ramesh Hospital: కేవలం ధనార్జనే ధ్యేయంగా రోగులకు సరైన సదుపాయాలు లేకుండా వ్యవహరించిందని రమేష్ ఆస్పత్రి నిర్వాకంపై ఆరోగ్యశాఖ నివేదిక ఇచ్చింది.

Report On Ramesh Hospital: కేవలం ధనార్జనే ధ్యేయంగా రోగులకు సరైన సదుపాయాలు లేకుండా వ్యవహరించిందని రమేష్ ఆస్పత్రి నిర్వాకంపై ఆరోగ్యశాఖ నివేదిక ఇచ్చింది. హోటల్ లో రోగుల కోసం కనీసం స్పెషలిస్టును కేటాయించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు నివేదికలో పేర్కొంది. కోవిద్ ఆస్పత్రి నిర్వహణకు ప్రభుత్వం విధించిన నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించిందని పేర్కొంది.

రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యానికి పది నిండు ప్రాణాలు పోయాయి. కోవిడ్‌ భయంతో వచ్చి హోటల్‌లో చేరినవారు చివరకు ఆస్పత్రి యాజమాన్య నిర్లక్ష్యానికి బలయ్యారు. ''రమేష్‌ యాజమాన్యం ఆ హోటల్‌కు అగ్నిమాపక అనుమతులు ఉన్నాయా లేదా.. రోగులకు ఎలాంటి వసతులు ఉన్నాయి అన్నది పట్టించుకోనేలేదు. హోటల్‌లో రోగుల కోసం కనీసం స్పెషలిస్టు డాక్టరును కూడా కేటాయించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది.'' అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదిక పేర్కొంది.

13 పేజీల నివేదికలో రమేష్‌ ఆస్పత్రి యాజమాన్య నిర్లక్ష్యాన్ని అడుగడుగునా ప్రస్తావించింది. రోగులను చేర్చుకోవడం, వారినుంచి డబ్బు తీసుకోవడం మినహా..ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదని, ప్రభుత్వ నిబంధనలు గానీ, ఐసీఎంఆర్‌ నిబంధనలు గానీ ఏవీ పాటించలేదని కమిటీ పేర్కొంది. స్వయానా కొంతమంది బాధితులే కమిటీ ముందుకొచ్చి రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగానే ఈ ఘటన జరిగినట్టు స్టేట్‌మెంటు ఇచ్చారని పేర్కొంది. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారికి చికిత్స అందించాల్సిన ఆస్పత్రి యాజమాన్యం పాజిటివ్‌ రానివారిని కూడా అక్కడ ఉంచి డబ్బులు దండుకుందని తేల్చింది. నివేదికలో ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి..

డీఎంహెచ్‌వోకు సమాచారమే లేదు..

► కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ కోసం అనుమతులు ఇచ్చాక అక్కడ చేర్చుకునే పేషెంట్లు, డిశ్చార్జి అయ్యే వారి వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో)కి తెలియజేయాలి. కానీ ఏ ఒక్కరోజూ ఒక్క పేషెంటు వివరం కూడా చెప్పలేదు.

► రెండు హోటళ్లలో కోవిడ్‌సెంటర్‌ నిర్వహణకు ప్రాథమిక అనుమతి ఇవ్వగా ఇతర హోటళ్లలో అనుమతి లేకుండా కోవిడ్‌ సెంటర్లను నిర్వహించారు. (అయితే ఈ సెంటర్లలో దేనికీ మున్సిపల్‌ పర్మిషన్లు గానీ,ఫైర్‌సేఫ్టీ ఎన్‌ఓసీలు గానీ లేనే లేవు.)

ఎక్స్‌రే, స్కానింగ్‌లతోనే..

► ఆర్టీపీసీఆర్‌ లేదా ట్రూనాట్‌ ద్వారా పాజిటివ్‌ అని నిర్ధారించిన తర్వాతే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చేర్చాలి. కానీ ఎక్స్‌రే, సీటీస్కాన్‌లు నిర్వహించి.. పాజిటివ్‌ అని తేలకపోయినా సెంటర్‌లో చేర్చుకున్నారు.

► హోటల్‌ చార్జీ, ట్రీట్‌మెంటు చార్జీల పేరిట రోజుకు రూ.25 వేలు వసూలు చేశారు.

► ప్రైవేటు సెంటర్‌ నిర్వాహకులు 10 పడకలు ఆరోగ్యశ్రీకి ఇవ్వాలని ఉంది. కానీ ఒక్క పడక కూడా ఇవ్వలేదు

► కొంతమంది రోగులను పాజిటివ్‌ అని తేల్చారు.. కానీ వారికి ఆ తర్వాత అపోలో సెంటర్‌లో నిర్ధారణ చేయగా నెగిటివ్‌ అని వచ్చింది.

ఇంజక్షన్ల వాడకంలోనూ నిర్లక్ష్యం..

► రోగి లక్షణాల తీవ్రత, రక్తంలో ఆక్సిజన్‌ తీవ్రత తగ్గడం వంటివి పరిశీలించాకనే రెమ్‌డెసివిర్‌ అనే యాంటీ వైరల్‌ మందులు ఇవ్వాలి. కానీ అందరికీ ఈ మందులు ఇచ్చినట్టు వెల్లడయ్యింది.

► తీవ్రత లేనివారికి కోవాఫిర్‌ ఇంజక్షన్లు ఇవ్వకూడదు. కానీ ఈ ఇంజక్షన్లు ఇచ్చినట్టు బిల్లుల్లో చూపించారు.

► ప్లాస్మా చికిత్స చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత రాష్ట్ర అథారిటీకి అధికారిక సమాచారం ఇవ్వాలి. అవేమీ లేకుండానే ప్లాస్మా చికిత్స చేశారు.

► రమేష్‌ ఆస్పత్రిలోనూ రోజుకు రూ.40వేల నుంచి రూ.60వేలు వసూలు చేశారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. తనవద్ద భారీగా వసూలు చేసినట్టు ఓ బాధితుడు కమిటీకి వాంగ్మూల మిచ్చాడు.

► చికిత్సలకు రోగులు ఎంత చెల్లించాలో డిస్‌ప్లే బోర్డులు పెట్టాలని నిబంధనలలో ఉన్నా ఎక్కడా పాటించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories